టీఎస్‌ఆర్టీసీకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లేనా?

టీఎస్‌ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ తార్నాక ఆసుపత్రిలో అత్యవసర సేవలను ప్రారంభించారు. ఇందులో 24  గంటల ఫార్మా యూనిట్, డయాలసిస్ కేంద్రం, ఐసీయు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం మార్చిలోగా తార్నాక ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం లెగాట్, డిబిఎస్ సంస్థలకు చెందిన పలువురు దాతలు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం తన ముఖ్య లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి సంస్థ మళ్ళీ లాభాలబాట పట్టేలా చేయాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులలో విధులు నిర్వహిస్తున్నప్పుడు పాన్, గుట్కా వంటివి తినడం మానుకోవాలని లేకుంటే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.