ఉదయం 8 నుంచి హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు షురూ

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి.    క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో రెండు గదులలో ఓట్లు లెక్కించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. ఒక్కో గదిలో 7 టేబిల్స్ ఏర్పాటు చేసి, 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి ఫలితం ప్రకటించిన తరువాత వరుసగా మండలాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించి 114 సెక్షన్ విధించారు. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధించేమాటైతే కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే టిఆర్ఎస్‌ ఆదిక్యతలో కొనసాగుతుంది. కానీ ఈసారి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపి (ఈటల రాజేందర్‌) హోరాహోరీగా పోరాడాయి కనుక దుబ్బాక ఉపఎన్నిక ఫలితంలాగే చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగవచ్చు. ఏది ఏమైనప్పటికీ సాయంత్రం 5 గంటలలోగా ఉపఎన్నిక ఫలితంపై పూర్తి స్పష్టత వస్తుంది.