అది ఈవీఎం కాదు... వీవీప్యాట్‌: ఆర్‌డీవో

మొన్న హుజూరాబాద్‌లో పోలింగ్ ముగిసిన తరువాత ఒక కారులో ఈవీఎంను తరలిస్తున్నట్లు గుర్తించిన బిజెపి నేతలు, కార్యకర్తలు దానిని అడ్డుకొని తమ మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేసి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకి పిర్యాదులు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి బల్మూరి వెంకట్, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఈవీఎంలు భద్రపరిచిన ఎస్‌ఆర్‌ కళాశాల వద్దకు చేరుకొని నిరసనలు తెలియజేశారు. ఈవీఎంను కారులో తరలించారనే ఈ వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. 

దీనిపై ఆర్‌డీవో రవీందర్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “కారులో తరలించింది ఈవీఎం కాదు... పాడైన వీవీప్యాట్‌ యంత్రం. పోలింగ్‌ స్టేషన్-200లో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు అది పనిచేయకపోవడంతో దాని స్థానంలో వేరే దానిని అమర్చాము. పాడైన దానిని ఈవీఎంలను తరలించే బస్సులోనే ఎస్‌ఆర్‌ కళాశాలకు తరలించాలనుకొన్నాము. కానీ కళాశాల ఆవరణలో బస్సులతో నిండిపోవడంతో అక్కడ మరో బస్సుకు చోటు లేదని సమాచారం రావడంతో పై అధికారి సూచన మేరకు వీవీప్యాట్‌ను బస్సులో నుంచి బయటకు తీసి కారులోకి మార్చుతుండగా కొందరు దానిని ఈవీఎం అనుకొని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసేశారు. ఇది పూర్తిగా అవాస్తవం. తప్పుడు సమాచారం. అయినప్పటికీ దీనిపై విచారణ జరిపించి ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు. 

ఈవీఎం తరలింపు వ్యవహారంలో ఇంత రసాభాస జరగడంతో కరీంనగర్‌లో ఈవీఎంలు భద్రపరిచిన ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ప్రతిపక్షా నేతలు, కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద కేంద్ర బలగాలను మోహరించి ఎవరూ లోపలకు ప్రవేశించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, మూడు ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి నుంచి కళాశాల చుట్టూ పహరా కాస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి అదే కళాశాలలో ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల కోసం ఎన్నికల అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.