హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారపర్వం ముగిసి నేడు పోలింగ్ మొదలవడంతో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ వరంగల్ చేరుకొని అక్కడ ప్రెస్‌మీట్ నిర్వహించాలనుకున్నారు. అయితే ఎన్నికల నిబందనల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్ధి పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లలో పాల్గొనరాదు. కనుక ఆయన నిన్న సాయంత్రం వరంగల్‌లోని గాయత్రి హోటల్‌కు వచ్చినప్పుడు పోలీసులు ఆయన లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదాలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాను గాయత్రి హోటల్లో బిజెపి నేతలతో కలిసి టిఫిన్ చేస్తూ పార్టీకి సంబందించిన ఇతర విషయాల గురించి వారితో చర్చించడానికి వచ్చానని ఈటల చెప్పగా, ఆయన ప్రెస్మీట్లో పాల్గొనేందుకు వచ్చారని బిజెపి నేతలు చెప్పడం విశేషం.
ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్‌ను పోలీసులు అద్దుకొంటున్నారని సమాచారం తెలుసుకొన్న బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు అక్కడకు చేరుకొని వారు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల నిబందనల ప్రకారం నియోజకవర్గంలో, ఉపఎన్నిక జరుగుతున్న జిల్లాలో ప్రెస్‌మీట్ పెట్టకూడదు కానీ వేరే జిల్లాలో ప్రెస్‌మీట్ పెట్టకూడదని ఎక్కడుందని నిలదీశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి గురువారం హన్మకొండలో ప్రెస్‌మీట్ పెడితే అభ్యంతరం చెప్పని పోలీసులు తమ ప్రెస్‌మీట్‌కు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని బిజెపి నేతలు నిలదీశారు. ఈటల రాజేందర్ ప్రెస్మీట్లో పాల్గొన్నప్పటికీ ఆయన మాట్లాడబోరని వారు హామీ ఇవ్వడంతో పోలీసులు అనుమతించారు. కానీ ప్రెస్మీట్లో బిజెపి నేతలు హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతుండటంతో వరంగల్ ఏసీపీ గిరి కుమార్ మద్యలో కలుగజేసుకొని అభ్యంతరం చెప్పారు.
ప్రెస్‌మీట్ మద్యలో ఆయన కలుగజేసుకోవడంపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ ఆయనకు, వారికీ మద్య వాదోపవాదాలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితులలోనే బిజెపి నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించి ముగించారు.