నేడే హుజూరాబాద్‌లో పోలింగ్

రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికకు మరికొద్ది సేపటిలో పోలింగ్‌ మొదలవబోతోంది. కరోనా నేపధ్యంలో ఈసారి కూడా అదనంగా మరో రెండు గంటలు పోలింగ్‌ సమయం పెంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుండి 7 వరకు కోవిడ్ రోగులు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారు. 

పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు అందరికీ పరీక్షలు చేసి కరోనా లేదని నిర్ధారించుకొన్న తరువాతే పోలింగ్‌ డ్యూటీలు వేశారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసి, ప్రతీ కేంద్రం వద్ద శానిటైజర్లు, మాస్కులు వగైరా అందుబాటులో ఉంచారు. ఓటర్లకు ముందుగా స్కానర్లతో పరీక్షించి జ్వరం, జలుబు వంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకొన్న తరువాతే ఓటు వేయడానికి అనుమతిస్తారు.      

హుజూరాబాద్‌ ఉపఎన్నికల బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో కలిపి మొత్తం 30 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కనుక ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండేసి ఈవీఎంలను పోలింగ్‌కు ఉపయోగిస్తున్నారు.

నియోజకవర్గంలోమొత్తం 2,37,036 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,17,993 మంది కాగా మహిళలు 1,19,102 మంది, ఒక్క నపుంసక ఓటర్లు ఉన్నారు. 

నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 127 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అదనపు భద్రత కల్పించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఉంటుంది. నవంబర్‌ 2వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.