
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరాళాలు అందజేయాలనే సిఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర కార్మికశాఖా మంత్రి చమాకూర మల్లారెడ్డి నేడు ఒక కోటి 83 లక్షల రూపాల నగదును విరాళంగా అందజేశారు. ఈరోజు మధ్యాహ్నం మేడ్చల్లోని తన కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఊరేగింపుగా యాదాద్రికి చేరుకొన్నారు. ఆ సొమ్మును తలపై పెట్టుకొని బాలాలయానికి వచ్చి అక్కడ ఆలయ ఈవో గీతారెడ్డికి దానిని అందజేశారు. ఇది మేడ్చల్ నియోజకవర్గం ప్రజల తరపున ఇస్తున్న విరాళం కాగా ఇది కాకుండా తన కుటుంబం తరపున మరో కేజీ బంగారాన్ని మంత్రి మల్లారెడ్డి విరాళంగా అందజేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు.