టిఆర్ఎస్‌కు జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ!

ఇటీవల టిఆర్ఎస్‌ ప్లీనరీ సభ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలలో ఆ పార్టీ జెండాలు, నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు, కటౌట్లు పెట్టినందుకు జీహెచ్‌ఎంసీ టిఆర్ఎస్‌ పార్టీకి రూ.5,000 జరిమానా విధించింది. ఈ నోటీసును నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికు అందజేశారు. 

మంత్రి కేటీఆర్‌ స్వయంగా పలుమార్లు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టవద్దని టిఆర్ఎస్‌ నేతలకు చెప్పారు. అయితే ప్లీనరీ సందర్భంగా నగరమంతటా తమ పార్టీ నేతలు బ్యానర్లు, జెండాలు పెడుతున్నా కేటీఆర్‌ పట్టించుకోలేదు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి టిఆర్ఎస్‌ చేతిలో ఉంది. నగర మేయర్ టిఆర్ఎస్‌కు చెందివారే. మునిసిపల్ మంత్రి టిఆర్ఎస్‌కు చెందినవారే. కనుక టిఆర్ఎస్‌ నేతలను అడ్డుకొనేందుకు జీహెచ్‌ఎంసీ కూడా ధైర్యం చేయలేదని భావించవచ్చు. కానీ  ప్రతిపక్షాల విమర్శలకు భయపడి జీహెచ్‌ఎంసీ టిఆర్ఎస్‌ పార్టీకి మొక్కుబడిగా ఈ జరిమానా విధించినట్లు అర్దమవుతూనే ఉంది.   

ఇదే కేసులో మేయర్ విజయలక్ష్మితో సహా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కూడా వేరేగా జరిమానాలు విధించినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.     

మేయర్ విజయలక్ష్మికి రూ.65 వేలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.1.50 లక్షలు, మంత్రి మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3.10 లక్షలు, టిఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శికి రూ.2.20 లక్షలు, టిఆర్ఎస్‌ మహిళా నేత సుజాతకు రూ.2 లక్షలు, టిఆర్ఎస్‌ నేత ఎర్రగుడ్ల శ్రీనివాస్‌కు రూ.50 వేలు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ రూ.25 వేలు, మాధవరం కృష్ణారావుకి 10 వేలు జరిమానాలు విధించినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.