కేసీఆర్‌ ఏపీలో పార్టీ పెట్టాలి: ఏపీ మంత్రి

ఇటీవల టిఆర్ఎస్‌ ప్లీనరీ సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిఆర్ఎస్‌ పార్టీని స్థాపించాలంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. సమయం వస్తే ఆ ఆలోచన కూడా చేస్తాం,” అని అన్నారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, “తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో టిఆర్ఎస్‌ పార్టీని ఏర్పాటు చేస్తామంటే స్వాగతిస్తాము. ఆయన మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపేసి ఏపీలో పోటీ చేస్తే మేము చాలా సంతోషిస్తాము. మా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉండాలని కోరుకొంటున్నారు,” అని అన్నారు. 

అయితే సిఎం కేసీఆర్‌ ఓ ఉద్దేశ్యంతో ఆ మాట అంటే, మంత్రి పేర్ని నాని మరో ఉద్దేశ్యంతో జవాబివ్వడం విశేషం. ఇరుగుపొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే బాగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి కేసీఆర్‌ ఆవిదంగా అంటే, టిఆర్ఎస్‌ తెలంగాణ పార్టీ కనుక ఏపీలో విస్తరించలేదని ఒకవేళ ఏపీలోకి రావాలనుకొంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీలో కలిపేసి రావాలని పేర్ని నాని సవాల్ విసిరినట్లు భావించవచ్చు. అయితే ఇటువంటి మాటల వలన ప్రజల మనోభావాలు దెబ్బ తినడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు.