
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం బుదవారం సాయంత్రంతో ముగిసినందున దాని కోసం ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీల నేతలు, కార్యకర్తలు అందరూ తక్షణం నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. బయటి వ్యక్తులను గుర్తించి తక్షణం నియోజకవర్గంలో నుంచి పంపించేవేయాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు నియోజకవర్గంలో మద్యం దుకాణాలు తెరవరాదని, ఎక్కడా మద్యం అమ్మకాలు, పంపిణీ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని శశాంక్ గోయల్ ఆదేశించారు.
పోలింగ్ రోజున నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తారని అనుమానంతో పోలీసులు 2,284 మందిని తహశీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. పోలింగ్ రోజున కేంద్ర బలగాల నుంచి 1,520 మంది, రాష్ట్ర స్పెషల్ పోలీసులు 174 మంది, కరీంనగర్ జిల్లా పోలీసులు 700 మంది, ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన 1,471 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని పార్టీలు డబ్బు, మద్యం, బంగారం, చీరలు వంటి బహుమతులను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3.50 కోట్లు నగదు, 1,091 లీటర్ల మద్యం, చీరలు, చెవి కమ్మలు, ముక్కు పుడకలు వంటి బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మొత్తం 116 మందిపై కేసులు నమోదు చేశారు.