
నవంబర్ 4న దీపావళి పండుగ సందర్భంగా అన్ని వ్యాపార సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటే, చమురు కంపెనీలు మాత్రం మరోసారి గ్యాస్ బండతో ప్రజల నెత్తిన బాదేందుకు సిద్దం అవుతున్నాయి. వచ్చే వారంలోగా భారీగా గ్యాస్ ధరలు పెంచబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధర పెరగడంతో నష్టాలు వస్తున్నాయని కనుక గ్యాస్ ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నాయి. ఒక్కో సిలిండరుపై కనీసం రూ.100 పెంచితే తప్ప నష్టం తప్పదని చెపుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఇంకా అనుమతివ్వాల్సి ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దీపావళి పండుగలోపుగానే గ్యాస్ ధరలు పెంచేందుకు చమురు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. ఈసారి వంద రూపాయలు కాకపోయినా ఒక్కో సిలిండరుపై రూ.30-50 వరకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర రూ.900 దాటింది. ఈ డిసెంబర్ నెలాఖరులోగా వెయ్యి రూపాయలు దాటిపోయినా ఆశ్చర్యం లేదు. ప్రతీరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూపోతున్నా ప్రజలు మౌనంగా చెల్లిస్తున్నారే తప్ప నిరసన తెలియజేయడం లేదు. కనుక గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినా పట్టించుకోరని చమురు కంపెనీలు భావిస్తున్నట్లున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రప్రభుత్వం అదుపుచేయకపోతే అన్నిటి ధరలు పెరుగుతాయి. అప్పుడు ద్రవోల్బణం పెరుగుతుంది. అప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.