గత రెండేళ్ళలో బలహీనపడిన తెలంగాణా రాజకీయ జేఏసిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ ఉద్యోగ, సాంస్కృతిక సంఘాలని మళ్ళీ జేఏసిలో చేర్చుకొని జేఎసిని బలోపేతం చేసుకొని, గ్రామస్థాయి వరకు తమ కార్యక్రమాల గురించి ప్రచారం చేపట్టాలని నిర్ణయించుకొన్నారు. రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కొత్తగా స్టీరింగ్ కమిటినీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈసారి జిల్లా, నియోజక, మండల స్థాయి కమిటీలని కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
జేఎసి నిర్ణయాలు, విధానాలకి అనుగుణంగా కార్యక్రమాలు (పోరాటాలు?) రూపొందించుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. దీని కోసం ఇక నుంచి ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి సోషల్ నెట్ వర్క్ మీడియాని కూడా ఉపయోగించుకోబోతున్నారు. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా నెలకొకసారి ప్రత్యేక న్యూస్ బులెటిన్ కూడా విడుదల చేయబోతున్నారు. దానిలో తెరాస సర్కార్ పనితీరు, నిర్ణయాలు, వాటిలో మంచిచెడు, వాటిపై జేఏసి అభిప్రాయాలు, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, జేఎసి కార్యాచరణ వంటివన్నీ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయా రంగాలలో నిపుణుల చేత మదింపు చేసి, ఒకవేళ లోపాలు ఉన్నట్లయితే ఈ నెలవారి బులెటిన్ ద్వారా వాటికి ప్రత్యమ్నాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. జేఎసి మీడియా బాధ్యతలని సమర్ధవంతంగా పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేయబోతున్నారు.
గత కొంత కాలంగా తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాటలలో, చేతల ద్వారా తెరాస సర్కార్ నిర్ణయాలు, దాని పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి కనబడుతూనే ఉంది. తెరాస సర్కార్ మొదట ఆయనకి చాలా ఘాటుగా బదులిచ్చింది కానీ అందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి ప్రతివిమర్శలు ఎదురవడంతో ఆ తరువాత నుండి ఆయన విమర్శలని బొత్తిగా పట్టించుకోవడం మానేసి తన పని తాను చేసుకొనిపోతోంది. కానీ కోదండరాం మాత్రం ప్రభుత్వం పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జిల్లాల పునర్విభజన విషయంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం అందరూ గమనించే ఉంటారు.
ఆయన తెరాస సర్కార్ కి సలహాలు, సూచనలు ఇస్తూ దాని లోపాలని ఎత్తి చూపించి వాటిని సవరించుకొనేలాగ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది కానీ ఆయన మాటలు, చర్యలు ప్రజలకి, ప్రభుత్వానికి కూడా వేరే విధంగా చేరుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన కూడా వాటిలాగే వ్యవహరిస్తుండటం వలన ఆయనకి రాజకీయ ఉద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానం ప్రజలకి కలిగితే ఆశ్చర్యమేమీ లేదు.
తెలంగాణా సాధన కోసం ఆయన చేసిన పోరాటాల కారణంగా రాష్ట్ర ప్రజలలో ఆయనకి చాలా మంచి పేరు, గౌరవం ఉంది. అటువంటి వ్యక్తి తెరాస సర్కార్ నిర్ణయాలని తప్పుపడుతూ అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాటిని వ్యతిరేకిస్తుండటం చేత ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని, అది తెరాసపై కూడా వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెరాస ఆందోళన చెందడం సహజమే. కనుక తెరాస సర్కార్ ఆయన పట్ల ఆగ్రహంతో ఉండటం కూడా సహజమే. కనుక ఇంతకీ ప్రొఫెసర్ కోదండరాం లక్ష్యం ఏమిటనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.