తెలంగాణలో మరో కొత్త పార్టీ

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలున్నాయి. త్వరలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ పుంజల ఆ కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. బుదవారం హైదరాబాద్‌లో బంజారా ఫంక్షన్ హాల్లో తన మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల అసంతృప్తితోనే మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలని నిర్ణయించుకొన్నానని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుండటంతో నేటికీ అధిక శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారని డాక్టర్ వినయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో మార్పు రావలసిన అవసరం చాలా ఉందని అన్నారు. డిసెంబర్‌ నెలాఖరులోగా పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించి ప్రజలలోకి వెళతానని చెప్పారు.