నేటితో హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారం ముగింపు

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం బుదవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఎన్నికల నిబందనల ప్రకారం పోలింగ్‌కు 72 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం నిలిపివేయవలసి ఉంటుంది. కనుక ఈరోజు సాయంత్రం 7 గంటలకు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించాలని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఎటువంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఒకవేళ నిర్వహిస్తే ఎన్నికల  కోడ్ ఉల్లంఘించినట్లవుతుంది కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని ప్రకటనలో తెలియజేశారు.  

సుమారు 5 నెలల క్రితం ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుంచే హుజూరాబాద్‌లో ఉపఎన్నిక హడావుడి మొదలైపోయింది. ఈ ఉపఎన్నికను సిఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో టిఆర్ఎస్‌, బిజెపిల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా బల్మూరి వెంకట్‌ను అభ్యర్ధిగా ప్రకటించి, రేవంత్‌ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారంలో దిగడంతో ఇప్పుడు పతాకస్థాయికి చేరుకొంది. హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మూడు ప్రధానపార్టీల నేతల విమర్శలు, ఆరోపణలతో యావత్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోవడం విశేషం. 

నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది కనుక ఇక నేటి రాత్రి నుంచే డబ్బు, మద్యం, నజరానాలతో తెర వెనుక ప్రలోభాల పర్వం మొదలవుతుంది. ఈనెల 30వ తేదీన హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరుగుతుంది. నవంబర్‌ 2న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.