ఎట్టకేలకి జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఈరోజు ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రులు, వివిద జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో సుదీర్గంగా చర్చలు జరిపిన తరువాత కొత్తగా మరో 4 జిల్లాల ఏర్పాటుకి ఆమోదముద్ర వేశారు. కనుక ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు ఉంటాయి. ముసాయిదా నోటిఫికేషన్ లో పేర్కొన్న 27 జిల్లాలు కాకుండా గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్ లని జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.
జిల్లాల విభజన ఈవిధంగా చేశారు:
వరంగల్: వరంగల్, హన్మకొండ, జయశంకర్, జనగామ మరియు మహబూబాబాద్.
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల.
కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల.
ఆదిలాబాద్: ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్, ఆసిఫాబాద్.
నల్గొండ: నల్గొండ, యధాద్రి, సూర్యాపేట.
రంగారెడ్డి: రంగారెడ్డి, శంషాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్.
మెదక్: మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట.
నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి.
ఖమ్మం: ఖమ్మం, కొత్తగూడెం.
కొన్ని జిల్లాలలో మండలాలు, గ్రామాల మార్పులు చేర్పులపై మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తరువాత, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తుది నిర్ణయం తీసుకొంటారు.
గద్వాల్ ని జిల్లాగా చేసినందున కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ చాలా సంతోషించి తన రాజీనామాని వెనక్కి తీసుకోవచ్చు. అదేవిధంగా జనగామని జిల్లాగా ప్రకటించమని డిమాండ్ చేసిన పొన్నాల కూడా చాలా సంతోషించవచ్చు. మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజక వర్గాన్ని ముసాయిదా నోటిఫికేషన్ లో జిల్లాగా ప్రకటించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆఖరు నిమిషంలో సిరిసిల్లాని కూడా జిల్లాగా ప్రకటించడం కేవలం వ్యూహాత్మకమేనని అనుమానం కలుగుతోంది. సిరిసిల్లాని జిల్లాగా ఏర్పాటు చేయమని ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ అధికార ప్రతిపక్షాలలో అందరికీ ఆమోదయోగ్యంగానే జరుగుతోంది కనుక ఇక్కడితో ఈ కధ సుఖాంతం అయినట్లే భావించవచ్చు.