మరికొద్ది సేపటిలో టిఆర్ఎస్ ప్లీనరీ సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా మొదలవబోతోంది. దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ విజయలక్ష్మి తదితరులు గత రెండు మూడు రోజులుగా అక్కడే మకాం వేసి సకల ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకొనేందుకు వెళ్ళిన ఓ ప్రముఖ మీడియా విలేఖరి టిఆర్ఎస్ నేతలను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. వారు అటువంటి ప్రశ్నను ఊహించనప్పటికీ చాలా చక్కగా సమాధానం చెప్పారు.
ఇంతకీ విలేఖరి ఏమడిగాడంటే, “మరో 5 రోజులలో హుజూరాబాద్ ఉపఎన్నికలు జరుగనున్నాయి. కానీ అక్కడ సభ నిర్వహించుకొనేందుకు ఎన్నికల కమీషన్ అనుమతించనందునే ఇక్కడ ప్లీనరీ నిర్వహిస్తున్నారా?” అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు ఓ టిఆర్ఎస్ నేత సమాధానమిస్తూ, “టిఆర్ఎస్ ప్లీనరీకి హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబందం లేదు. మా పార్టీ 20 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఘనంగా ప్లీనరీ నిర్వహించుకొంటున్నాము. ఇందులో తప్పేమీ లేదు కదా? ఈ ప్లీనరీలో మా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొంటాము. ఆయన ఈ సమావేశంలో మా పార్టీకి దిశానిర్దేశం చేస్తారు. ఇది మా పార్టీ అంతరంగిక వ్యవవహారం,” అని అన్నారు.