
నేడు మాదాపూర్ హెటెక్స్‌లో టిఆర్ఎస్ ప్లీనరీ సభ జరుగనుంది. టిఆర్ఎస్ స్థాపించి 20 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ ప్లీనరీ సభను చాలా ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ప్లీనరీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆరువేల మంది పార్టీ ప్రతినిధులు, విదేశాల నుంచి టిఆర్ఎస్ శాఖల ఎన్‌ఆర్‌ఐలు హాజరుకానున్నారు. సుమారు 10-15 వేల మంది దీనికి హాజరవుతారని టిఆర్ఎస్ నేతలు అంచనా వేసి తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ ప్లీనరీకి కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్లీనరీలో టిఆర్ఎస్ అధ్యక్షుడుని ఎన్నుకొనేందుకు, ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించేందుకు జరుగుతోంది కనుక పార్టీ చెందినవారైనప్పటికీ ఇతరులు ఎవరూ రావద్దని, ప్లీనరీని ప్రసార మాధ్యమాల ద్వారా చూడాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించబోయే విజయ ఘర్జన సభకు అందరూ హాజరుకావచ్చునని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ జండా ఎగురవేయడంతో ప్లీనరీ సభ మొదలవుతుంది. అనంతరం ఏడు తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంది. అనంతరం తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు. ఆ తరువాత సిఎం కేసీఆర్‌ను మళ్ళీ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకొంటారు. చివరిగా సిఎం కేసీఆర్ ప్రసంగంతో ప్లీనరీ సభ ముగుస్తుంది.
సభా వేదికపై సిఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారు. వేదికపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు.
మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు సంతోష్ కుమార్, గడ్డం రంజిత్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ ప్లీనరీకి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేశారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం నోరూరించే 33 రకాల శాఖాహార, మాంసాహార వంటలు సిద్దం చేస్తున్నారు.
జయభేరీకి చెందిన 30 ఎకరాలలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాటిలో 5,500 వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల నుంచి బస్సులలో వచ్చే టిఆర్ఎస్ ప్రతినిధుల కోసం వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
మాదాపూర్ హెటెక్స్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ జండాలు, బ్యానర్లతో గులాబీ మాయం అయ్యాయి. సభా ప్రాంగణం చుట్టూ సిఎం కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. వివిద జిల్లాల నుంచి వచ్చిన టిఆర్ఎస్ ప్రతినిధులు గులాబీ రంగు దుస్తులు ధరించి చేరుకొన్నారు. వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అల్పాహారం, చాయ్, పానీలు వగైరాలు అందజేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభా ప్రాంగణానికి చేరుకొన్నారు. మరి కొద్ది సేపటిలో సిఎం కేసీఆర్ కూడా సభా వేదిక వద్దకు చేరుకొంటారు.