దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపధ్యంలో ఆ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు దళిత బంధు పధకం నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్లేపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తి హైకోర్టులో నేడు పిటిషన్‌ వేశారు. నియోజకవర్గంలో ఇతర సంక్షేమ పధకాలన్నీ అమలవుతున్నప్పుడు దళిత బంధు పధకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని పిటిషనర్‌ పేర్కొన్నాడు. కనుక ఈసీ ఆదేశాన్ని పక్కన పెట్టి హుజూరాబాద్‌లో తక్షణం దళిత బంధు పధకాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. తన పిటిషన్‌లో కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.