గంజాయిపై ఉక్కుపాదం మోపండి: సిఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఇటీవల తరచూ భారీగా గంజాయి పట్టుబడుతుండటం, రాష్ట్రంలో గుట్టుగా గంజాయి సాగు చేస్తుండటంపై సిఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈరోజు ప్రగతి భవన్‌లో హోంశాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కేసీఆర్‌ సమావేశమై ఈ సమస్యపై సుదీర్గంగా చర్చించారు. 

రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. దీనిని తక్షణం కట్టడి చేయకపోతే తెలంగాణ సాధించిన అభివృద్ధిని మింగేస్తుందని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల మొదలు పాఠశాలలు, కాలేజీలు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాలపై గట్టి నిఘా పెట్టి గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. దీనికోసం పోలీస్, నిఘా విభాగాలలో ప్రత్యేక బృందాలను, వ్యవస్థలను, వాహనాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ ఆలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మా, హోంశాఖ సలహాదారు అనురాగ్ శర్మ, డిజిపి మహేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, తదితరులు హాజరయ్యారు.