
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కుషీ నగర్‌లోని కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ బుదవారం ప్రారంభించారు. రూ.260 కోట్ల వ్యవయంతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన దీనిలో అత్యాధునిక సదుపాయాలు, లేటస్ట్ టెక్నాలజీ కలిగి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ కుషీ నగర్ విమానాశ్రయాన్ని ప్రారంభించి దానిని జాతికి అంకితం చేశారు. త్వరలోనే ఢిల్లీ నుంచి కుషీ నగర్‌కు స్పైస్ జెట్ సంస్థ దేశీయ విమానసేవలు ప్రారంభించబోతోంది.
ఉత్తర ప్రదేశ్‌లో పలు భౌద్ద క్షేత్రాలు, ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. కుషీ నగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో దేశవిదేశాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు సౌలభ్యం ఏర్పడిందని యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీ బెన్, పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియా, శ్రీలంక క్రీడాశాఖ మంత్రి నమల్ రాజపక్స, యూపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూపీలో మరో విమానాశ్రయం ఏర్పాటుకావడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ తెలంగాణలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం చాలా బాధాకరం. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందున్న రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నప్పటికీ, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ యావత్ రాష్ట్రానికి ఒకే ఒకటి శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉంది. వరంగల్‌లో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా కోరుతోంది. దానికి అవసరమైన భూమి, ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నా కేంద్రప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటుకి చొరవ తీసుకోవడం లేదు. ఇకనైనా కేంద్రం వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలూ సంతోషిస్తారు.