రేవంత్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్

మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శపధం చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు సన్నాసిలాగా రాష్ట్రంలో తిరుగుతున్నాడు. పిసిసి అధ్యక్ష పదవి లభించగానే ఏదో సాధించినట్లు విర్రవీగుతున్నాడు. ఆయన ఆ పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నిక హుజూరాబాద్‌ ఉపఎన్నిక. దానిలో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు దక్కించుకోవాలని నేను రేవంత్‌ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. హుజూరాబాద్‌లో గెలవలేమని తెలిసే అక్కడకి వెళ్ళడం లేదు. అక్కడ బిజెపితో కుమ్మక్కై ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు పెద్దపల్లికి చెందిన ఓ డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టాడు. కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కైనా ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్సే గెలుస్తుంది,” అని అన్నారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురించి మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆయనొక్కరే మంచి నేత. మిగిలిన వారందరూ అక్రమార్కులే. కానీ కాంగ్రెస్‌లో భట్టి మాట చెల్లడం లేదు,” అని అన్నారు. 

ఈటల రాజేందర్‌ గురించి మాట్లాడుతూ, “రాష్ట్ర రాజకీయాలలో కె.జానారెడ్డి కంటే సీనియర్ నాయకుడా...ఈటల రాజేందర్‌? నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డినే 35 ఏళ్ళ పిలగాడితో ఓడించాము. ఈటల రాజేందర్‌ మాకు ఓ లెక్కా?ఈ ఉపఎన్నికలో ఓడిపోయిన తరువాత ఈటల, జి. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే ఈటల రాజేందర్‌ నేటికీ బిజెపితో ఆంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ఏమి చేస్తాడో ఈటల చెప్పడు. ఎంతసేపు మాపై బురద జల్లుడుతోనే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. తన వలనే దళిత బంధు పధకం వచ్చిందని ఈటల చెప్పుకు తిరుగుతున్నాడు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే దాని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామనే సంగతి ఆయనకూ తెలుసు. అయినా ఒక నియోజకవర్గంలో గెలిచేందుకు ఎవరైనా రూ.1.70 లక్షల కోట్ల పధకాన్ని ప్రకటిస్తారా?ఈటల తన బాధను ప్రపంచ బాధ అని అనుకొంటున్నాడు. కానీ హుజూరాబాద్‌ ప్రజలకు అన్నీ తెలుసు. ఈ ఉపఎన్నికలో ఆయనను ఓడించి గట్టిగా బుద్ది చెప్పబోతున్నారు,” అని అన్నారు.             

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం గురించి మాట్లాడుతూ, “తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళతారు. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టబోతున్నారనేది వాట్సాప్‌ యూనివర్సిటీ సృష్టి మాత్రమే. దానిలో ఎంతమాత్రం నిజం లేదు,” అని అన్నారు.