మార్చి 28న యాదాద్రి పునః ప్రారంభం

సిఎం కేసీఆర్‌ మంగళవారం యాదాద్రిలో పర్యటించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తిరిగి నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “యాదాద్రి పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఉత్తరాయణంలో అంటే మార్చి 28వ తేదీన ఆలయానికి మహాకుంభ సంప్రోక్షణ చేసిన తరువాత ఆలయాన్ని పునః ప్రారంభించాలని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు ముహూర్తం ఖరారు చేశారు. ఆ తరువాత భక్తులకు స్వయంభూ (తనంతట తానుగా ఉద్భవించిన) స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తాము. 


ముందుగా మార్చి 21 తేదీ నుంచి యాదాద్రిపై 200 ఎకరాలలో 108 యజ్ఞకుండాలలో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. ఈ యాగానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు, వేద పండితులను ఆహ్వానిస్తాము. మహా సుదర్శన యాగంలో 1.50 లక్షల నెయ్యిని వినియోగిస్తాము.   


ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయాలని నిర్ణయించాము. దీని కోసం సుమారు 125 కిలోల బంగారం అవసరం ఉంటుంది. నేను నా కుటుంబం తరపున ఒక కిలో 16 తులాల బంగారాన్ని ఆలయానికి విరాళంగా ఇస్తున్నాను,” అని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. 


ఆలయ గోపురం బంగారు తాపడానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు 22 కేజీల బంగారం విరాళం ఇచ్చారు. వారిలో హెటేరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత పార్ధసారధి రెడ్డి 5 కిలోలు, త్రిదండి చినజీయర్ స్వామి ఒక కిలో, మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంత రావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ రావు, నమస్తే తెలంగాణ మీడియా ఎండీ దామోదర్ రావు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు తలో కిలో బంగారం చొప్పున, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కిలోలు బంగారం విరాళంగా ఇస్తున్నారని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు.

“దీనికి సుమారు 65 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ మహత్కార్యంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరుకొంటున్నాను. తద్వారా ఈ ఆలయం మనది అనే భావన అందరిలో కలుగుతుంది, అని సిఎం కేసీఆర్‌ అన్నారు.