పాక్‌తో టీ-20 ఆడతారా?అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్రమోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. “ఓ వైపు పాక్‌ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో తొమ్మిది మంది సైనికులు, పలువురు ప్రజలు చనిపోయారు. ఇటువంటి పరిస్థితులలో భారత్‌ క్రికెట్ జట్టు పాక్‌ జట్టుతో టి-20 ఆడేందుకు ఎలా మనసొప్పింది? మన సైనికులు, వలస కూలీలు, సామాన్య పౌరులు పాక్‌ ఉగ్రవాదుల చేతుల్లో మరణిస్తున్నా మీకు పట్టదా? జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏమి చేస్తున్నాయి? మోడీ ప్రభుత్వం ఏమి చేస్తోంది?అక్కడి పరిస్థితులను అదుపు చేయడంలో ఘోరంగా మోడీ ప్రభుత్వం విఫలమైంది,” అని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.  

  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నా ప్రధాని నరేంద్రమోడీ వాటిని కట్టడి చేయకుండా మౌనంగా ఉండిపోతున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రధాని నరేంద్రమోడీకి పట్టదా?” అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.