అన్నాడీఎంకె పార్టీకి శశికళ తొలి షాక్

తమిళనాడు రాజకీయాలలో శశికళ మళ్ళీ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాను త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అన్నాడీఎంకె పార్టీని తన అధీనంలోకి తీసుకొంటానని ప్రకటించిన శశికళ అన్నంత పనీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

నిన్న ఆ పార్టీ సీనియర్, జూనియర్ నేతలు, కార్యకర్తలు అందరూ చెన్నైలో తమ పార్టీ కార్యాలయంలో పార్టీ స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకొంటుండగా, ఆమె దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉపయోగించిన కారుకి అన్నాడీఎంకె పార్టీ జెండాను పెట్టుకొని నగరంలో తిరుగుతూ, ఆమె కూడా పోటీగా పార్టీ స్వర్ణోత్సవాలను నిర్వహించారు. 

ఒకచోట వేసిన ఓ శిలాఫలకంలో తాను అన్నాడీఎంకె పార్టీ కార్యదర్శినని ఆమె వ్రాయించుకొన్నారు. అంటే పార్టీ నేతలతో సంబందం లేకుండా తనకు తానే పార్టీ కార్యదర్శిగా ప్రకటించుకొన్నారన్న మాట! నగరంలో పలుచోట్ల పార్టీ కార్యక్రమాలలో పాల్గొనప్పుడు ఆమె అనుచరులు, ఎంజీఆర్, జయలలిత అభిమానులు, మహిళలు ఆమెకు మంగలహారతులిచ్చి స్వాగతం పలికారు. వారు కూడా ఆమెను జయలలిత వారసురాలు, పార్టీ అధినేతగా కీర్తిస్తూ జేజేలు పలికారు. అప్పుడు శశికళ కూడా జయలలితలాగే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

శశికళ తీరుతో అన్నాడీఎంకె పార్టీలో నేతలు తలలు పట్టుకొంటున్నారు. ఆమె రాకతో పార్టీలో ఎంతమంది ఆమెవైపు ఫిరాయిస్తారో... పార్టీ నిలువునా చీలిపోతుందని ఆందోళన చెందుతున్నారు.