
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్కం ఠాగూర్ నేడు హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్ధి బల్మూరి వెంకట్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ముందుగా నియోజకవర్గంలో ఉపఎన్నికల ఇన్ఛార్జ్, సమన్వయకర్తలతో సమావేశమయ్యి స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రత్యర్ధుల బలాబలాలు, పార్టీ వ్యూహాల గురించి చర్చిస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. తరువాత హైదరాబాద్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం ఛార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడంలో ఎన్నడూ ఇబ్బంది పడలేదు కానీ ఈ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది. అందుకు కారణం ఈ ఉపఎన్నికలో ప్రధానంగా పోటీ టిఆర్ఎస్, బిజెపిల మద్యనే సాగుతుండటమే. ఇంకా చెప్పాలంటే...ఈ ఉపఎన్నిక సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంగా భావించవచ్చు. కనుక ఓటమికి సిద్దపడే కాంగ్రెస్ పార్టీ దీనిలో ప్రవేశించిందని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్‌ను వీడి టిఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోకతప్పదు.
కనుక మానిక్కం ఠాగూర్ హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం వలన కాంగ్రెస్ అభ్యర్ధికి ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ కాంగ్రెస్ కూడా బరిలో దిగింది కనుక ప్రయత్నించక తప్పదు.