హైదరాబాద్ జంట నగరాలలో పోలీసులు ఇకపై పగలు కూడా వాహనదారులకి డ్రంక్-అండ్-డ్రైవ్ పరీక్షలు నిర్వహించవలసిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నగర శివార్లలో హయత్ నగర్ మండలంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న తల్లీ కూతుళ్ళని కారు డీకొంది. అదేదో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు. ఆ సమయంలో కారు నడుపుతున్న యువకుడితో సహా కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు మద్యం సేవించి ఉన్నారు. ఆ మత్తులోనే రోడ్డు పక్క బస్సు కోసం ఎదురుచూస్తున్న శ్రీదేవి, ఆమె నాలుగేళ్ళ చిన్నారి సంజనని కారుతో గుద్దేశారు. ఆ తరువాత వారు భయంతో కారుని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు.
చాలా తీవ్రంగా గాయపడిన వారిరువురినీ 108లో ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో చిన్నారి సంజనకి పక్కటెముకలు విరిగిపోయాయి. సంజన తలకి తీవ్రగాయం అవడంతో కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెకి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అంటే ఇక ఆమె కోలుకొనే అవకాశం లేనట్లే భావించవచ్చు. ఆమె తల్లి పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉంది. ఆమె కూడా చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతోంది. తన కూతురి పరిస్థితి గురించి ఆమెకి ఇంకా తెలియదు.
ఈ ప్రమాదానికి కారణమైన ఆ కారులో మద్యం సీసాలని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వాహన యజమానిని, ఆ కారు నడిపిన వ్యక్తిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ లో ఇదేవిధంగా జరిగిన కారు ప్రమాదంలో రమ్య అనే చిన్నారి బలైపోయింది. మళ్ళీ ఇప్పుడు సంజన బలైపోయింది. ఎవరో చేసిన తప్పుకి వారిద్దరూ బలైపోయారు. వారి కుటుంబాలకి తీరని శోకం మిగిలింది.
హైదరాబాద్ లో కొన్నిరోజులు వరుసగా చెయిన్ స్నాచింగ్ దొంగలు మహిళలపై విరుచుకుపడి వారి ఆభరణాలు ఎత్తుకుపోయేవారు. వారి బెడద కొంత తగ్గింది అని అనుకొంటుంటే ఇప్పుడు మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అభం శుభం తెలియని, ఇంకా లోకం కూడా చూడని చిన్నారులు వారి నిర్లక్ష్యానికి అన్యాయంగా బలైపోతున్నారు. బంగారం లాంటి కుటుంబాలు చితికిపోతున్నాయి. నగర పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడో అక్కడ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే, రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు ఏదో యుద్దభూమిలోకి వెళ్ళినట్లుగా మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.