సిద్ధిపేట మినీ ట్యాంక్‌ బండ్‌లో మ్యూజికల్ ఫౌంటెన్ షో

సిద్దిపేటలోని కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ మరింత పర్యాటక శోభ సంతరించుకుంది. దసరా పండుగ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌పై ఆక్వా స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెన్ షోను ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా అధికారులు,  స్థానిక నేతలు   హాజరయ్యారు. 

ఈ సంగీత జలదృశ్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆక్వా స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఉంటుంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్‌తో ప్రతిరోజు రెండు నుంచి మూడు షోలు ప్రదర్శించేలా అధికారులు ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద లేజర్ లైటింగ్ షోను మించి సిద్ధిపేట కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ పై ఆక్వా స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెన్ లేజర్ షో ఉంటుందని అన్నారు.