ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ, ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు మహాద్వారం వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సిఎం జగన్ ఆలయ ప్రాంగణంలో బియ్యంతో తులాభారం వేయించుకొని 78 కేజీల బియాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ తరువాత ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్ద ప్రసాదాలను అందజేశారు.
ఆ తరువాత సిఎం జగన్ శ్రీ వేంకటేశ్వరభక్తి ఛానల్లో కొత్తగా హిందీ, కన్నడ ఛానల్స్‌ను ప్రారంభించారు. అనంతరం తిరుమలలో రూ.10 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమల కొండపైన గల అన్నమయ్య భవన్‌కు చేరుకొని టీటీడీ అధికారులతో తిరుమల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తరువాత పద్మావతీ అతిధి గృహానికి చేరుకొని అక్కడ కాసేపు విశ్రమించిన తరువాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకొంటారు.