
కేంద్రప్రభుత్వం త్వరలోనే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీసే కార్యక్రమం మొదలుపెట్టబోతోంది. ఇదే సమయంలో దేశంలో బీసీ జనాభాను కూడా వేరుగా లెక్కించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ నేడు ఓ తీర్మానం ఆమోదించింది. సిఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, “తెలంగాణ జనాభాలో సుమారు 50 శాతం వరకు బీసీలున్నారు. వారిలో అనేక కులాలలో అణగారిన, నిరుపేదలున్నారు. వారికీ న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను, అని తెలిపారు.
సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిని కేంద్రప్రభుత్వానికి పంపిస్తుంది. అయితే కేంద్రం దీనికి అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే, బీసీ జనాభా లెక్కలు తీయాలంటే ముందుగా బీసీలను గుర్తించాలి. దేశంలో అనేక కులాలవారు తమనూ బీసీలలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలకు పూనుకొంటే వారందరూ తమనూ బీసీలలో చేర్చాలంటూ ఆందోళనలు మొదలుపెట్టవచ్చు. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాజకీయాలు చేయకమానవు. దాంతో కేంద్రప్రభుత్వానికి ఊహించని తలనొప్పులు ఎదురవుతాయి. కనుక బీసీ జనాభా లెక్కలు తీయడమంటే తేనె తుట్టెను కదిపినట్లే. కనుక కేంద్రప్రభుత్వం తెలంగాణ శాసనసభ చేసిన ఈ తీర్మానాన్ని పట్టించుకోకపోవచ్చు.