
హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్లు వేసేందుకు నేడే చివరి రోజు. టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలి రోజునే నామినేషన్ వేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈటల రాజేందర్ భార్య జమున కూడా సోమవారం నామినేషన్ వేశారు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఈటల రాజేందర్ (బిజెపి అభ్యర్ధి) నేడు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు కూడా నేడే నామినేషన్ వేయబోతున్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలిరాగా అతికష్టం మీద వారిలో ఒక్కరినీ మాత్రమే నామినేషన్ వేయనిచ్చారు. మిగిలినవారిని పోలీసులు, రిటర్నింగ్ అధికారులు అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేస్తుండటంతో గత రెండు మూడు రోజులుగా వారు హుజూరాబాద్‌లోనే ఉండిపోయి తమ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు, కోవిడ్ డబుల్ డోస్‌కు వాక్సిన్ సర్టిఫికెట్లు పట్టుకొని నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తామందరం ప్రచారం చేస్తామని తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్:
నోటిఫికేషన్: అక్టోబర్ 1వ తేదీ (నామినేషన్ల స్వీకరణ)
నామినేషన్లకు గడువు : అక్టోబర్ 8 వరకు
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 13వ తేదీ వరకు
పోలింగ్: అక్టోబర్ 30వ తేదీ
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: నవంబర్ 2వ తేదీ.