
హురాన్ ఇండియా సంస్థ ఇటీవల భారత్‌లోని బిలియనీర్ల జాబితా ప్రకటించింది. దానిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్ధసారధి రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 58వ స్థానంలో ఉన్నారు.
భారత్‌లో బిలియనీర్ల జాబితా ప్రకటించిన కొద్ది రోజులకే ఆదాయపు పన్ను శాఖ హెటిరో కాపెనీలు, కార్యాలయాలు, దాని అధినేత ఇళ్ళలో సోదాలు మొదలుపెట్టడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆయన ఇళ్ళు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేసి సోదాలు మొదలుపెట్టింది.
బుదవారం ఉదయం గురువారం మధ్యాహ్నం వరకు ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో హెటిరో కంపెనీ ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలు, వాటికి సంబందించి పన్ను చెల్లింపుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. హెటిరో గ్రూపులో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న వారి ఇళ్ళు, కార్యాలయాలలో కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కరోనాకు దేశంలో చాలామంది బలైపోయారు. అనేకమంది జీవితాలు ఛిద్రమయ్యాయి. ముఖ్యంగా సామాన్య, నిరుపేదలను కరోనా మహమ్మారి కోలుకోలేని విదంగా దెబ్బ తీసింది. అయితే కరోనా మహమ్మారి ఫార్మా కంపెనీలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులు కురిపించింది. కరోనా పేరు చెప్పి అవి ప్రజలను నిలువునా దోచుకొంటున్నా ప్రభుత్వాలు వాటిని ఏమి చేయలేకపోయాయి. దాంతో అవి మరింత రెచ్చిపోయి అయినకాడికి ప్రజలను మందులు, వైద్య చికిత్స పేరుతో దోచుకొని కోట్లు గడించాయి. కనుక ఆదాయపన్ను శాఖ ముందుగా కరోనాకు చికిత్స చేసిన కార్పొరేట్ హాస్పిటల్స్, కరోనా సమయంలో బ్లాకులో మందులు అమ్ముకొన్న ఫార్మా కంపెనీలలో సోదాలు నిర్వహిస్తే మంచిదేమో?