
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. ఇదివరకు వారు సామాన్య ప్రజలను కవచంగా వాడుకొంటూ భద్రతాదళాలపై దాడులు చేసేవారు కానీ ఇప్పుడు సామాన్య ప్రజలనే కాల్చి చంపుతున్నారు. ప్రధానంగా కశ్మీరీ పండిట్లను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
నిన్న ఉదయం 11.15 గంటలకు శ్రీనగర్ శివారులోని సంగం ఈద్గా ప్రభుత్వ పాఠశాలలో ఉగ్రవాదులు జొరబడి ఆ స్కూల్ ప్రిన్సిపల్ సుపీందర్ కౌర్, దీపక్ చంద్ అనే ఉపాధ్యాయుడిని కాల్చి చంపారు.
రెండు రోజుల క్రితం శ్రీనగర్‌లో ఇక్బాల్ పార్కు వద్దగల ఓ మెడికల్ షాప్ యజమాని మఖాన్ లాల్ బింద్రూని తుపాకీతో కాల్చి చంపారు. ఆయన కూడా కశ్మీరీ పండిట్టే. ఆ తరువాత అదే వీధిలో రోడ్డు పక్కన పానీ పూరీ చిరు వ్యాపా రి వీరేందర్‌ను కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ ఇద్దరినీ కాల్చి చంపిన తరువాత బాందీపురా జిల్లాలో నయీద్ ఖాయ్ అనే ప్రాంతంలో టాక్సీ స్టాండ్ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ షఫీని కాల్చి చంపారు.
సామాన్య పౌరులపై ఈవిదంగా దాడులు చేయడం ద్వారా ప్రజలలో భయాందోళనలు రేకెత్తించాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి కేంద్రప్రభుత్వం అధీనంలోకి తీసుకొన్న తరువాత ఉగ్రవాదం చాలా వరకు అదుపులోకి వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయి పౌరులపై దాడులు చేస్తున్నారు. కనుక వారిని ఉక్కుపాదంతో అణచివేయవలసి ఉంది లేకుంటే పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయి.