తెలంగాణా గురించి కెసిఆర్ చెప్పిన కొత్త విషయం?

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న తన మంత్రులు, తెరాస నేతలతో సమావేశం నిర్వహించి జిల్లాల పునర్విభజన గురించి చాలా లోతుగా చర్చించి అనేక మార్పులు చేర్పులు చేశారు. అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ విషయంలో ప్రజాభీష్టం మేరకే అంతా జరగాలి తప్ప తెరాస లేదా ప్రతిపక్ష నేతల రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి మార్పులు చేర్పులు జరుగవని చాలా స్పష్టంగా చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. సుమారు నాలుగున్నరేళ్ళ క్రితమే తెలంగాణా ఏర్పడబోతోందని తమకి నిశ్చయంగా తెలిసిందని, ఆనాడే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్ రావు వంటి పెద్దలందరితో కలిసి తాను తెలంగాణా ఏర్పడితే జిల్లాల పునర్విభజన, చెరువుల త్రవ్వకాలు వంటివాటి గురించి చాలా లోతుగా చర్చలు జరిపామని చెప్పారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న నిజమాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మొదలైనవారందరితో ఈ జిల్లాల పునర్విభజన అంశం గురించి చర్చించి వారి అభిప్రాయలు కూడా తెలుసుకొన్నారు.

ముందు నుంచి అనుకొంటున్నట్లుగానే దసరా రోజు (అక్టోబర్ 11) నుంచే కొత్త జిల్లాల ఏర్పటు అవడం ఖాయం అయినప్పటికీ, అవసరమైతే ఈలోగానే ప్రజాభీష్టానికి అనుగుణంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లలో కూర్పుని మార్చడానికి అభ్యంతరమేమీ లేదని చెప్పారు. 

ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే గ్రామాలన్నీ విధిగా ఒకే మండలంలో ఉండవలసిన అవసరం లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్న చోట ఆ గ్రామాలని ప్రత్యెక రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని కెసిఆర్ అన్నారు. ఆ వంకతో మళ్ళీ అదే మండల కేంద్రంలో కొనసాగించడం కూడా అనవసరమని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

నిన్న జరిగిన సమావేశం ముఖ్యమంత్రి తీసుకొన్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు:    

1. తెలంగాణా సాధన కోసం ఉద్యమించిన వారిలో ప్రముఖుడు కొండా వెంకటరెడ్డి. ఆయన స్వగ్రామం మొయినాబాద్ లోని మంగళారం. అదిప్పుడు శంషాబాద్ జిల్లాలో చేరుతోంది. కనుక అయన గౌరవార్ధం శంషాబాద్ జిల్లాకి రంగారెడ్డి జిల్లాగా పేరు నిర్ణయించారు. 

2. రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలో ఆమనగల్, తలకొండపల్లి, కడ్తాల మండలాలని చేర్చడం.

3. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లా యధాతధంగా ఉంటుంది.  

4. మద్దిరాల, నేరేడుకొమ్ము, మల్లారెడ్డి గూడెం మండలాలని చేర్చి మొత్తం 10 మండలాలతో నల్గొండ జిల్లాని ఏర్పాటు చేయడం.

5. యాద్రాద్రి జిల్లాలో సంస్థాన్ నారాయణ్ పూర్ మండలాన్ని చేర్చడం.

6. మహబూబ్ నగర్ జిల్లా లో గండీడ్ మండలాన్ని చేర్చడం.

7. కుత్బుల్లాపూర్ లోని దొమ్మరి పోచమ్మ మండలం పేరు గండి మైసమ్మగా మార్పు చేయడం. 

8. కామారెడ్డి జిల్లాలో బీబీపేట మండలం ఏర్పాటు చేయడం. ఆ జిల్లాలో ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం.

9. కొడంగల్, బ్రోంసపేటలని వికారాబాద్ లో చేర్చడం. 

10. మెదక్ జిల్లాలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం.

11. సిద్ధిపేట జిల్లాలో కొమురువెల్లి మండలం ఏర్పాటుకి గల అవకాశాలని పరిశీలించాలి.

12. దౌలతాబాద్ మండలాన్ని ఏ జిల్లాలో చేర్చాలనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం.

13. ఆందోల్ నియోజక వర్గంలోని వట్టిపల్లిని మండలం ఏర్పాటు చేయడానికి అవకాశాలు పరిశీలించడం.