
మంగళవారం శాసనసభలో దళిత బంధు పధకంపై చర్చలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “దళిత బంధు పధకం కొత్తగా వచ్చింది కాదు 1986 లోనే ఇందిరా గాంధీ హయాంలోనే ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా దళితుల అభివృద్ధికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దేశంలో దళితుల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కనుక మేము బాగా ఆలోచించి ఈ పధకాన్ని ప్రవేశపెట్టాము. ఈ పధకం ద్వారా ఇచ్చిన సొమ్ముతో ఒకరు ఎన్ని వ్యాపారలైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. మంచిదనుకొంటే నలుగురితో కలిసి చేసుకోవచ్చు. ఈ పధకం ద్వారా వారికిచ్చిన ఈ డబ్బును వారు తిరిగి చెల్లించనక్కరలేదు. ప్రభుత్వమే ఆ భారం భరిస్తుంది.
వచ్చే బడ్జెట్లో ఈ పధకానికి రూ. 20,000 కోట్లు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చొప్పున మొత్తం 20 వేలమందిని ఎంపిక చేసి అందిస్తాం. ఒకవేళ వారు నష్టపోతే వారిని ఆదుకొనేందుకు రూ.4,000 కోట్లతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాము. కనుక ఈ పధకంతో తప్పక సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. ఈ పధకాన్ని హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే తెచ్చామనే ప్రతిపక్షాల వాదన సరికాదు. ఒక్క నియోజకవర్గంలో గెలిచేందుకు అబద్దాలు చెప్పక్కరలేదు..ఎవరినీ మోసగించనవసరం లేదు. వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. కనుక టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు దళిత బంధు పధకం ఆగదు,” అని అన్నారు.