సిఎం కేసీఆర్‌ నోట మళ్ళీ ఉద్యోగాల భర్తీ మాట

త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఎం కేసీఆర్‌ సుమారు 10 నెలల క్రితం చెప్పారు. ఆ తరువాత 50 వేలు కాదు...65 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఊరించారు. ఇప్పుడు 65 వేలు కాదు...80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెపుతున్నారు. 

మంగళవారం శాసనసభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “రాబోయే రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.35 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వస్తే స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని అనుకొంటే కేంద్రప్రభుత్వం దానికి ఆమోదం తెలుపడానికి చాలా ఆలస్యం చేసింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాల భర్తీ, విభజన జరుగుతుంది,” అని అన్నారు. 

మరో రెండు మూడు నెలల్లో అంటే...వచ్చే సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. కనుక ఇక అంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఎవరూ ఆశగా ఎదురుచూడక్కరలేదు. కానీ ఆ తరువాత కూడా మళ్ళీ మరో ఆరు నెలలో...ఏడాదో వాయిదా వేయకుండా ఉంటే చాలని నిరుద్యోగులు కోరుకొంటున్నారు.