దళిత బంధుకి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? భట్టి

ఈరోజు శాసనసభ దళిత బంధు పధకంపై జరుగుతున్న చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ దళిత బంధు పధకాన్ని నేను, మా పార్టీ కూడా స్వాగతిస్తున్నాము. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి పదేసి లక్షల చొప్పున ఇవ్వాలనే కోరుకొంటున్నాము. అయితే మీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని స్పష్టం అయ్యింది. ఈ పధకం ద్వారా వారందరికీ కూడా ఆర్ధికసాయం అందించడానికి రూ. 1.70 లక్షల కోట్లు అవసరమని స్పష్టంగా కనిపిస్తోంది. కనుక అంత సొమ్మును ప్రభుత్వం ఏవిధంగా ఎక్కడి నుంచి సమకూర్చుకొంటుంది? ప్రతీ బడ్జెట్‌లో ఈ పధకానికి వేరేగా నిధులు కేటాయిస్తుందా లేదా? అనేదానిపై సిఎం కేసీఆర్‌ ఈ సభ ద్వారానే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను.

ఈ పధకం అమలుకు అవసరయ్యే సొమ్ము, ప్రభుత్వం కేటాయిస్తున్న సొమ్మును చూస్తున్నప్పుడు ఈ పధకం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందాలేదా అనే అనుమానం కలుగుతుంది. ఈ పధకం కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తవగానే అటకెక్కిస్తారా? అనే అనుమానం కలుగుతుంది. ‘ధనం మూలం మిదం జగత్’ (అన్నిటికీ డబ్బే మూలం) కనుక ఈ పధకం అమలుకు కూడా డబ్బే ప్రధానం. కనుక ఈ పధకం అమలుకి అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చుకోగలదా లేదా?దీని కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తుందా లేదా?అనే విషయం తెలియకుండా దీనిపై ఎంత చర్చించినా వృద్ధాయే. ఎందుకంటే, అమలుచేయలేని వాటి గురించి సభలో ఎంత చర్చించి ఏం ప్రయోజనం?” అని అన్నారు.