
రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న దళిత బంధు పధకంపై నేడు శాసనసభలో చర్చ జరుగనుంది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తరువాత సిఎం కేసీఆర్ దీనిపై సభ్యుల సందేహాలకు వివరణ ఇస్తూ ప్రసంగిస్తారు.
ఈ పధకాన్ని అధికార టిఆర్ఎస్ రాజకీయాలలో, ఉపఎన్నికలో ‘గేమ్ ఛేంజర్’గా భావిస్తుండటంతో గట్టిగా సమర్ధించుకొంటోంది. దేశంలో మరే ప్రభుత్వం దళితులకు మేలు చేసేందుకు ఇటువంటి ఆలోచన కూడా చేయలేకపోయిందని, తమ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా దళితుల కోసం ఈ పధకాన్ని తీసుకువస్తే ప్రతిపక్షాలు దీనిపై కూడా రాజకీయాలు చేస్తూ తమపై బురద జల్లుతున్నాయని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.
అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే హడావుడిగా ఈ పధకాన్ని తెరపైకి తెచ్చిందని, ఉపఎన్నిక అయిపోగానే ఈ పధకాన్ని అటకెక్కించేస్తుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ పధకం ప్రభుత్వానికి శక్తికి మించినది కనుక దీనిని అమలుచేయడం చాలా కష్టమని భావిస్తున్నవారు కూడా ప్రభుత్వ చిత్తశుద్దిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమను రాజకీయంగా దెబ్బ తీసి పైచేయి సాధించడానికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పధకం ప్రవేశపెట్టిందని భావిస్తున్న ప్రతిపక్షాలు ఇదే పధకాన్ని ప్రభుత్వం మెడకు గుదిబండలా తగిలించేందుకు బలమైన వ్యూహంతో ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లయితే హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ తక్షణమే ఈ పధకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది దాదాపు అసంభవమని అందరికీ తెలుసు. ఇదే అసంభవమనుకొంటే...దళితులతో పాటు గిరిజనులు, మైనార్టీలు, కార్మికులు ఇలా... రాష్ట్రంలో ప్రతీ వర్గానికి ఈ ‘బంధు’ పధకాన్ని ప్రకటించి అమలుచేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఆయా వర్గాల కులసంఘాలు కూడా తమకూ ఈ బంధులు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. దళిత బంధు పధకంతోనే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి, ఆర్ధికభారం పడుతుంది. ఇప్పుడు బంధు పధకాల కోసం ప్రతిపక్షాలు, కుల సంఘాల డిమాండ్స్ తో ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. కనుక నేడు శాసనసభలో దళిత బంధు పధకంపై అధికార, ప్రతిపక్షాల మద్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.