
ప్రస్తుతం వివిద కేసులలో చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తీన్‌మార్ మల్లన్నకు బిజెపిలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ మల్లన్నకు ఈ విషయం చెప్పేందుకు సోమవారం జైలుకి వెళ్ళి మూలాఖాత్ సమయంలో కలిసి వచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తీన్‌మార్ మల్లన్న ఏమైనా తీవ్రవాదా...గత 37 రోజులుగా జైల్లో ఓ మారుమూల గదిలో ఒంటరిగా బందించి ఉంచారు. జైలు అధికారులు తనను తీవ్రవాదినన్నట్లు చూస్తూ మానసికంగా వేదిస్తున్నట్లు మల్లన్న చెప్పారు. సిఎం కేసీఆర్ అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం ఆయనను ఈవిదంగా వేధిస్తోంది. పోలీసులు కూడా హైకోర్టు వారిస్తున్నా ఆయనపై పదేపదే కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం ఆయనను ఏవిదంగా వేధిస్తోందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంతగా వేధిస్తున్నా మల్లన్న ఓ పోరాట యోధుడు కనుక ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే బిజెపిలోకి సాధరంగా ఆహ్వానం పలుకుతాము,” అని ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ అన్నారు.