దళిత బంధు నిధులపై ఆంక్షలేల? బండి సంజయ్

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ దళిత బంధు పధకం గురించి కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఆదివారం హుజూరాబాద్‌లో శక్తి సంఘాల నేతలతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దళిత బంధు పధకంతో దళితుల బ్యాంక్ ఖాతాలలో పడేసి లక్షలు చొప్పున జమా చేసినట్లు టిఆర్ఎస్‌ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ ఆ సొమ్మును దళితులు వాడుకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు నిలిపివేశాయి. దళితులను ఉద్దరిస్తామని వారి ఖాతాలలో డబ్బు వేసి దానిని వారు వాడుకోనీయకుండా ఎందుకు నిలిపివేశారంటే పదేసి లక్షలు పంచిపెట్టినా టిఆర్ఎస్‌కు ఉపఎన్నికలో గెలుస్తామనే నమ్మకం లేదు. కనుక ఓడిపోతే ఆ డబ్బును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని భావిస్తోంది. బహుశః అందుకే దానిని ఫ్రీజ్ చేసి ఉండవచ్చు. 

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు కూడా హైదరాబాద్‌లో వరద బాధితులందరికీ పదేసి వేలుచొప్పున ఇస్తామని కొంతమందికి డబ్బు పంచిపెట్టి, ఎన్నికలవగానే ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అలాగే హుజూరాబాద్‌లో కూడా ఈ దళిత బంధు పధకం నిలిపివేయడం ఖాయం. కరెన్సీ నోటుకీ, కమలం గుర్తుకీ మద్య జరుగుతున్న ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోవడం ఖాయం. ఈవిషయం సిఎం కేసీఆర్‌కు కూడా బాగా తెలుసు. అందుకే ఉపఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖలు వ్రాశారు. ఇలా ఓడిపోయే చోట మంత్రి హరీష్‌రావుని పంపిస్తూ గెలిచే చోట కొడుకు కేటీఆర్‌ను పంపిస్తుంటారు. ఇంతకు ముందు దుబ్బాకకు, ఇప్పుడు హుజూరాబాద్‌కు మంత్రి హరీష్‌రావును పంపించడం గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. బిజెపిలో రాజా సింగ్‌, రఘునందన్ రావు ఇద్దరు ఆర్‌లు ఉన్నారు. ముచ్చటగా ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ముగ్గురు ఆర్‌లు అవుతారు,” అని బండి సంజయ్‌ అన్నారు.