రాంగ్ రూట్‌లో కేటీఆర్‌ కారు...నిలిపివేసిన ట్రాఫిక్ ఎస్‌ఐ

ఈరోజు హైదరాబాద్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. నేడు గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లో బాపూఘాట్‌కు వెళ్ళి మహాత్మా గాంధీజీకి నివాళులు ఆర్పిస్తారు కనుక ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్‌ వాహనం నిషేదించిన మార్గంలో దూసుకు వచ్చింది. అప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ఐలయ్య ఆ కారును నిలిపివేసి వెనక్కు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. కానీ కారు వెనుకే బైక్‌లపై వస్తున్న టిఆర్ఎస్‌ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ‘మంత్రి కేటీఆర్‌ కారునే అడ్డుకొంటావా?’ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. 

ఆ కారులో మంత్రి కేటీఆర్‌ ఉన్నారా లేరా అనే విషయం తెలియవలసి ఉంది. దానిలో ఆయన ఉన్నా లేకున్నా ట్రాఫిక్ నియమాలను పాటించి, అనుమతించిన మార్గంలోనే వెళ్ళి ఉండి ఉంటే ఈ సమస్య ఎదురయ్యేదే కాదు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌, పోలీస్ శాఖ ఇంకా స్పందించాలవలసి ఉంది.