హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరు ఖరారు?

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసేందుకు గడువు (అక్టోబర్ 8) దగ్గర పడుతుండటంతో నిన్న కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యి పార్టీ అభ్యర్ధిగా ఎవరిని బరిలో దింపాలనేదానిపై లోతుగా చర్చించారు. చివరికి భారత జాతీయ విద్యార్ధి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగరావుకు సమావేశంలో పాల్గొన్న నేతలందరూ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

వెంకట్ నర్సింగరావు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు కావడం, విద్యార్ధి నాయకుడిగా యువతలో మంచి గుర్తింపు కలిగి ఉండటం, ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తుండటం, పార్టీ పెద్దలతో, కరీంనగర్‌ జిల్లా నేతలందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం, ముఖ్యంగా పార్టీకి విధేయంగా ఉండటం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆయన అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వెంకట్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధులకు సరైన ప్రత్యర్ధిగా నిలుస్తారని కాంగ్రెస్‌ పెద్దలు భావించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తీసుకొని ఈరోజు సాయంత్రంలోగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.