తెలంగాణ ప్రభుత్వంపై సీతక్క ఆగ్రహం

ఈరోజు శాసనసభ సమావేశంలో ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గ్రామ పంచాయతీలకు తామే నిధులు ఇస్తున్నామని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొంటున్నాయి. కనుక దానిలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతెంత? అలాగే గోదావరి నదిలో నుంచి తీస్తున్న ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తోందో చెప్పాలంటూ...” సీతక్క మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు?సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం వలన మీకేమి ప్రయోజనం? ఉపాధి హామీ పధకం కింద కేంద్రం నుంచి వస్తున్న నిధులను వేరే అవసరాలకు వాడుకోవడం నిజమా కాదా? అని అడుగుతుంటే జవాబు చెప్పకుండా ఇది అజెండాలో లేదంటూ మాట్లాడనీయడం లేదు. మేము మంత్రులను ప్రశ్నిస్తుంటే వారిని సమాధానం చెప్పనీయకుండా మద్యలో ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకొంటున్నారు? మేము ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మైక్ కట్ చేస్తుంటారు. కానీ మీ మంత్రులు గంటల తరబడి సొంత  డబ్బా కొట్టుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇదేం పద్దతి? అంటూ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.