రేపటితో బండి సంజయ్‌ పాదయాత్ర సమాప్తం

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర శనివారం ముగిస్తారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బిజెపి అధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఆ సభకు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ హాజరుకానున్నారు. సుమారు లక్ష మందితో అంబేడ్కర్ సెంటర్‌లో బహిరంగ సభను నిర్వహించేందుకు బిజెపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్‌ ఉదయం 10.30 గంటలకు హుస్నాబాద్‌ పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన తరువాత రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సభలో పాల్గొంటారు. రేపటి సభను హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించాలని బిజెపి అనుకొన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వలన అక్కడికి సమీపంలోని హుస్నాబాద్‌లో సభ నిర్వహిస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తయిన తరువాత బండి సంజయ్‌ మళ్ళీ రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తారు.