సజ్జనార్ వచ్చారు...ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలొస్తున్నాయి

టీఎస్‌ఆర్టీసీని ప్రగతి రధ చక్రాలనేవారు. అది ఒకప్పటి మాట! ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ అంటే నష్టాల మూట! దానిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను మేనేజింగ్ డైరెక్టరుగా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టగానే మొట్ట మొదట ఆర్టీసీ ఉద్యోగుల జీతాల సమస్యపై దృష్టి పెట్టి పరిష్కరించారు. టీఎస్‌ఆర్టీసీ నష్టాలలో మునిగిపోతున్న కారణంగా గత మూడేళ్ళుగా ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాలు అందేసరికి 15-20వ తేదీ అవుతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యను అర్ధం చేసుకొన్న సజ్జనార్ బ్యాంకులతో మాట్లాడారు. 

ప్రతీనెల రూ.100 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చి 1వ తేదీన జీతాలు చెల్లించేమాటైతే ఆ బ్యాంకులో సదరు డిపోల రోజువారి కలెక్షన్లు జమా చేసేందుకు ఖాతా తెరుస్తామని సజ్జనార్ ప్రతిపాదించారు. టీఎస్‌ఆర్టీసీ రోజువారీ కలెక్షన్లు లేదా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము నుంచి ఆ బాకీని ఎప్పటికప్పుడు మినహాయించుకోవచ్చని సజ్జనార్ ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ అంగీకరించి నేడే (అక్టోబర్ 1వ తేదీన) టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులందరికీ వారి బ్యాంక్ ఖాతాలలో జీతాలు జమ చేసేందుకు అంగీకరించింది. దీంతో మళ్ళీ మూడేళ్ళ తరువాత తొలిసారిగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు 1వ తేదీన జీతాలు అందుకోబోతున్నారు.