కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేదు అందుకే...కపిల్ సిబాల్

ఒకప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వంటి హమాహేమీల సారధ్యంలో దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత ఏడేళ్ళుగా నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. ఆ కారణంగా కాంగ్రెస్‌ జాతీయ పార్టీ స్థాయి నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోయింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా జాతీయ స్థాయిలోను, ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితిలో లేదు. దీనికంతటికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమేనని కపిల్ సిబాల్ వంటి సీనియర్ నేతలు వాదిస్తున్నారు. 

ఇటీవల కాంగ్రెస్‌ పాలిత పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, ఆయన వెంటనే బిజెపిలో చేరే ఆలోచనతో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం, పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌ సిద్దుతో సహా ఓ మంత్రి, ముగ్గురు నేతలు రాజీనామాలు చేయడంవంటి పరిణామాలు జరిగాయి. జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం, ఏఐసీసీ సమావేశం నిర్వహించి ఇటువంటి సమస్యలపై చర్చించడానికి పార్టీ అధిష్టానం వెనకాడుతుండటం వంటివి పార్టీకి ఇటువంటి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కపిల్ సిబాల్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని, బలమైన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని 23 మంది సీనియర్ నేతలు కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్టు నెలలో లేఖ వ్రాశామని కానీ అధిష్టానం తమను పార్టీ వ్యతిరేకులుగా భావిస్తూ దూరం పెట్టి పార్టీకి చేటు కలిగించేవారిని చేరదీసిందని కపిల్ సిబాల్ అన్నారు. పార్టీ పూర్తిగా నష్టపోక మునుపే సమూలంగా ప్రక్షాళన చేసి బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతూ త్వరలో మళ్ళీ తాము సోనియా గాంధీకి మరో లేఖ వ్రాయనున్నట్లు సిబాల్ మీడియాకు తెలిపారు.