హుజూరాబాద్‌లో నేనే పోటీ చేస్తా: ఈటల

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మాట్లాడుతూ, “హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధిగా నేనే పోటీ చేస్తాను. మీ అందరి ఆశీర్వాదలతో నేనే గెలుస్తాను. ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు టిఆర్ఎస్‌ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను ఇక్కడ మోహరించినా నా గెలుపును ఎవరూ ఆపలేరు,” అని అన్నారు. 

ఈటల మొదట్లో తన గెలుస్తాననే నమ్మకం ఏర్పడనందున తన భార్య జమున పోటీ చేయవచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్‌ ప్రభుత్వం దళిత బంధుతో సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నప్పుడు, ఈటల రాజేందర్‌ తానే పోటీ చేసి గెలుస్తానని నమ్మకంగా చెపుతుండటం విశేషం. అంటే హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌, ఈటల బలాబలాలలో మార్పు వచ్చిందనుకోవచ్చు. 

టిఆర్ఎస్‌ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ లక్షకు పైగా మెజార్టీతో ఈటల రాజేందర్‌పై గెలుస్తారని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. నేడో రేపో కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించనుంది. ఒకవేళ కొండా సురేఖను బరిలో దించితే ఓట్లు చీలి టిఆర్ఎస్‌ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.