విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం

దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు విజయవంతం అవడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి సిద్దమవుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “విద్యార్దులు, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ నేటికీ వారి ఆకాంక్షలు నెరవేరనేలేదు. విద్యార్దులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లభించడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం లేదు. ఆ కారణంగా వారు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. టిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ తగినంతమంది విద్యార్దులు లేరనే వంకతో గ్రామాలలో పాఠశాలలు మూసివేయించారు. దీంతో పేదపిల్లలు విద్యకు దూరమయ్యారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం కనీసం ఉపాధ్యాయులను కూడా భర్తీ చేయడం లేదు,” అని అన్నారు. 

ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఉద్యోగమూ లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా టిఆర్ఎస్‌ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. విద్యార్దులకు, నిరుద్యోగులకు జరుగుతున్న ఈ అన్యాయాలను ప్రశ్నించేందుకు అక్టోబర్ 2 నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి-నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో ఉద్యమం ప్రారంభిస్తాం,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.