డికె అరుణ అలాగ చేస్తే ఎవరికి నష్టం?

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. తెరాస సర్కార్ గద్వాల్ ని జిల్లాగా ఏర్పాటు చేయనందుకు నిరసనగా ఆమె రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఆమె ఈరోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

రెండు, మూడు వారాల క్రితం ఆమె, పొన్నాల తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి గద్వాల్ ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన జవాబుతో ఆమె కంగు తిన్నారు. “పరిపాలనా సౌలభ్యం, ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని చేర్చి వారికి మరింత సౌకర్యం కలిగించేందుకే జిల్లాల పునర్విభజన చేస్తున్నాము తప్ప రాజకీయనాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం జిల్లాలని ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. కనుక గద్వాల్ ని జిల్లాగా ప్రకటించలేమని కెసిఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 

గద్వాల్ ప్రజల ఆకాంక్షలు ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలియజేసేందుకు తాను ఎన్నో విధాలుగా ప్రయత్నించానని కానీ ఆయన వాటిని పట్టించుకోకపోవడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కి పంపిస్తున్నాని, దానిని స్పీకర్ కి పంపి ఆమోదింపజేయవలసిందిగా ఆమె కోరారు. 

అయితే ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా తెరాస సర్కార్ గద్వాల్ ని జిల్లాగా ప్రకటించదనే సంగతి స్పష్టం అయ్యింది. కనుక రాజీనామా చేయడం వలన స్వయంగా ఆమె, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల్ నియోజక వర్గ ప్రజలే నష్టపోతారు తప్ప తెరాస సర్కార్ కాదు. పైగా దాని వలన కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా బలహీనపడుతుంది.