అక్టోబర్ 5 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు

ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ వర్షాకాల శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజున ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. శాసనసభలో అజ్మీర్‌ చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్‌, మాచర్ల జగన్నాథం మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్‌, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిల మృతికి సంతాపం తెలిపారు. అనంతరం ఉభయసభలు 27కి వాయిదా పడ్డాయి. 

తరువాత శాసనసభ స్పీకర్, మండలి ప్రోటెం ఛైర్మన్‌ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అక్టోబర్ 5వరకు ఉభయసభలు సమావేశాలు నిర్వహించాలని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించగా, కనీసం 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై శాసనసభ స్పీకర్, మండలి ప్రోటెం ఛైర్మన్‌ నిర్ణయం తీసుకొంటారని సిఎం కేసీఆర్‌ చెప్పారు. శని, ఆదివారం రెండు రోజులు విరామం తరువాత ఉభయసభలు మళ్ళీ సమావేశం అవుతాయి.