తీన్‌మార్ మల్లన్న కేసులతో ప్రభుత్వానికి కొత్త సమస్యలు

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి వేదిస్తున్నారంటూ ఆయన భార్య జాతీయ బీసీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్త ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందునే ఆయనపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.     

జాతీయ బీసీ కమీషన్‌ ఆమె ఫిర్యాదుపై స్పందిస్తూ తీన్‌మార్ మల్లన్నపై నమోదు చేసిన కేసులకు సంబందించి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదిక సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, డిజిపి మహేందర్ రెడ్డి ఇద్దరూ తమ ముందు విచారణకు హాజరవ్వాలని జాతీయ బీసీ కమీషన్‌ ఆదేశించింది. 

దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారి పిటిషన్లను తిరస్కరించింది. కనుక వారిరురువురూ జాతీయ బీసీ కమీషన్‌ ముందు హాజరయ్యి తీన్‌మార్ మల్లన్న కేసులపై సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. ప్రభుత్వంలో అత్యున్నత పదవులలో ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులు జాతీయ బీసీ కమీషన్‌ ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం ప్రభుత్వానికి ఇబ్బందికరమే.