టీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఉద్యమించక తప్పదు: చాడా

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడటం లేదు. తాజాగా టీఎస్‌ఆర్టీసీ నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో టికెట్ ఛార్జీలను పెంచాలనే  ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ సానుకూలంగానే స్పందించారు. అయితే నాలుగైదు నెల్లల్లో టీఎస్‌ఆర్టీసీ గాడిన పడకపోతే ప్రైవేటీకరణ చేయవలసి వస్తుందని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ చెప్పడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తప్పు పట్టారు. 

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకొంటుంటే, ఇక్కడ సిఎం కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీ నాలుగైదు నెలల్లో గాడిన పడకపోతే ప్రవేటీకరిస్తామని కార్మికులను బెదిరించడం చాలా దుర్మార్గపు చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు. టీఎస్‌ఆర్టీసీని కాపాడుకొనేందుకు ఎంతవరకైనా పోరాడటానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని చాడా వెంకట్ రెడ్డి అన్నారు.